హైదరాబాద్, వెలుగు: ప్లాస్టిక్వేస్ట్ను రీసైకిల్చేసే స్టార్టప్ బన్యన్ నేషన్ సంస్థ రూ.200 కోట్లతో రాష్ట్రంలో భారీ విస్తరణకు ముందుకొచ్చిందని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పటాన్చెరు పరిధిలోని పాశమైలారం వద్దనున్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఇప్పటికే ఆ సంస్థ ఏటా 15 వేల టన్నుల ప్లాస్టిక్వ్యర్థాలను రీసైకిల్చేస్తున్నదన్నారు. దానిని మరో 45 వేల టన్నుల సామర్థ్యానికి విస్తరించేందుకు సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. గురువారం సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబుతో సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు.
సంస్థ విస్తరణ పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను యూనిలివర్, టాటా మోటార్స్ వంటి పెద్ద సంస్థలకు బన్యన్నేషన్సరఫరా చేస్తున్నదని చెప్పారు. రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో సంస్థ మంచి లాభాలతో నడుస్తున్నదన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం వారు మరికొంత భూమిని అడుగుతున్నారని, దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సీఈవో వి. మధుసూదన్, బన్యన్నేషన్సీఈవో మణి వాజ్‌పేయి, సీవోవో రాజ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.